ఆగం చేసిన వాన
జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ధాన్యంలో నిలిచిన నీటిని తొలగించడానికి రైతులు నానా పాట్లు పడ్డారు.
నాగిరెడ్డిపేట: మండలంలో ఉదయం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆరబెట్టారు. సాయంత్రం తిరిగి వాన రావడంతో మళ్లీ వడ్లు తడిశాయి. రోజూ వర్షం కురుస్తుండడంతో పలుచోట్ల మొలకలు వస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
లింగంపేట: మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. మండల కేంద్రంతో పాటు మోతె, ముస్తాపూర్, లింగంపల్లి, అయిలాపూర్, ఒంటర్‌పల్లి, శెట్పల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, ఆరబెట్టిన వడ్లు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం నిల్వల మధ్య నుంచి వర్షం నీటిని తొలగించడానికి రైతులు ఆవస్థలు పడ్డారు.
కామారెడ్డి రూరల్: జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఇల్చిపూర్ కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రోజు వర్షం వస్తుండడంతో వరిధాన్యం తడిసి పోతోందని రైతులు పేర్కొంటున్నారు. వరిధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.
రామారెడ్డి: మండలంలో మంగళవారం ఒక్కసారి గా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలలో అరబోసిన ధాన్యం తడిచిపోయింది. కొనుగోలు కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేవని, త్వరగా కాంటా కా వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త ప్పనిసరి పరిస్థితులలో వ్యాపారులకు అమ్మాల్సి వ స్తోందంటున్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకాల ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బాన్సువాడ రూరల్: మండలంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. తాడ్కోల్, బుడిమి, తిర్మలాపూర్, కొత్తాబాది, బోర్లం తదితర గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సదాశివనగర్ : మండల కేంద్రంతో పాటు, అడ్లూరు ఎల్లారెడ్డి, ధర్మారావుపేట్, కుప్రియల్, పద్మాజీవాడి, ఉత్తనూర్, వజ్జాపల్లి, బొంపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. మక్కలు సైతం తడిసిపోయాయి. ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు అందించాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఆగం చేసిన వాన


