పసుపు పంటలో తెగుళ్లతో జాగ్రత్త..
● ప్రధానంగా రెండు రకాల
శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి
● నివారణ చర్యలు చేపట్టాలంటున్న
వ్యవసాయశాఖ అధికారులు
బాల్కొండ: పసుపు పంటలో ఆకు తెగుళ్లతో జాగ్రత్త అంటూ బాల్కొండ ఉద్యావన శాఖ అధికారి రుద్ర వినాయక్ రైతులను హెచ్చరిస్తున్నారు. ఈమేరకు తెగుళ్ల లక్షణాలు– నివారణ చర్యలను ఒక ప్రకటనలో వివరించారు. పసుపు పంటలో ప్రధానంగా సోకే ఆకు తెగుళ్లు రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి తాటకు మచ్చ తెగుళ్లు (మర్రాకు తెగుళ్లు), రెండవది ఆకు మాడు తెగుళ్లు పసుపు పంటను ఆశిస్తాయి.
తాటాకు మచ్చ తెగులు( మర్రాకు తెగులు): తాటాకు మచ్చ తెగులు కొల్లెటోట్రై కమ్ క్యాప్సిసి అనే శిలీంద్రం ద్వారా పంటకు సోకుతుంది. వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఆకుల మీద సోకుతుంది. ప్రధానంగా అక్టోబర్ చివరిలో ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది.
లక్షణాలు: ఈ శిలీంధ్రం సోకినప్పడు ఆకులపై పెద్దపెద్ద అండాకారపు మచ్చలు ఏర్పడి (4–15 సెంటీమీటర్లు) సైజులో ముదురు గోదుమ రంగులో ఉంటాయి. మచ్చ చుట్టు పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఈ మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకు మాడిపోతుంది.
నివారణ: లీటరు నీటికి 1 మిల్లీ లీటర్ల ప్రొపికోనజోల్ లేదా గ్రాము కార్బండిజమ్, 1.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి ఎకరానికి 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. లేదా 1 మిల్లీ లీటరు అజోక్సిస్ట్రోబిన్ లీటరు నీటికి కలుపుకుని పిచికారి చేసుకోవాలి.
ఆకు మాడు తెగులు: ఆకు మాడు తెగులు టాప్రిన్‌మాక్యులాన్స్ అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఎక్కువగా వ్యాపిస్తుంది.
లక్షణాలు: ఈ తెగుళ్ల వలన ఆకులపై ముందుగా చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు క్రమంగా అండాకారంగాను చతురస్రాకారంగాను ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పాడుతాయి. ఈ మచ్చలు క్రమేపి ఆకులంతా వ్యాపించి, ఆకు మాడిపోతుంది.
నివారణ: లీటరు నీటికి 1 మిల్లీలీటరు ప్రొపికొనజోల్ లేదా 1 గ్రాము థయోఫినెట్ మిథైల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్, 1.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 మిల్లీలీటరు అజోక్సిస్ట్రోబిన్ కలిపి ఎకరానికి 200 లీటర్ల నీటిని పిచికారి చేయాలి.
మర్రాకు తెగులు సోకిన పసుపు ఆకు మాడు తెగులు సోకిన పసుపు
పసుపు పంటలో తెగుళ్లతో జాగ్రత్త..


