రైతుల్లో ‘మోంథా’ గుబులు!
మూడుసార్లు తడిసింది
వారంనుంచి కొనుగోలు కేంద్రంలోనే..
● తుపాను ప్రభావంతో వర్షాలు
● తడుస్తున్న ధాన్యం
● ఆందోళనలో అన్నదాతలు
నాగిరెడ్డిపేట : మోంథా తుపాను జిల్లాలోని రైతులకు గుబులు పుట్టిస్తోంది. తుపాను ప్రభావంతో పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి అడపాదడపా వర్షం కురుస్తోంది. దీంతో వడ్లు తడుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో వానాకాలం పంటకోతలు చేపట్టడంతో భారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది. రైతులు వడ్లను ఆరబోశారు. తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం, సాయంత్రం వేళల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాలు, రోడ్లపై రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. అయితే ఆకాశంలో మబ్బులు పట్టిన ప్రతిసారీ ఆరబోసిన ధాన్యాన్ని కుప్పగా చేయడం, మబ్బులు తొలగిపోగానే తిరిగి ఆరబెట్టడంతోనే రోజంతా గడిచిపోయింది. ధాన్యం తడిసి మొలకలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పది రోజుల క్రితం పంటకోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చా. అప్పటి నుండి ధాన్యాన్ని ఆరబెడుతూనే ఉన్నాను. ఇప్పటికే మూడుసార్లు వాన పడి వడ్లు తడిశాయి. వాన పడుతుండడంతో మళ్లీమళ్లీ తడుస్తున్నాయి. త్వరగా తూకాలు పూర్తయ్యేలా చూడాలి.
– లక్ష్మీకాంతారెడ్డి, రైతు, నాగిరెడ్డిపేట
వారం క్రితం కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చాం. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాం. వర్షం కురిసిన ప్రతిసారి ధాన్యం తడవకుండా ఉండేందుకు కుప్పగాచేసి టాపర్లు కప్పడం, వర్షం తగ్గాక కుప్పలను తెరిచి మళ్లీ ఆరబెట్టడం.. రోజూ ఇదే జరుగుతోంది.
– కుమ్మరి గంగమణి, మహిళా రైతు, నాగిరెడ్డిపేట
రైతుల్లో ‘మోంథా’ గుబులు!
రైతుల్లో ‘మోంథా’ గుబులు!
రైతుల్లో ‘మోంథా’ గుబులు!


