‘రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’
బాన్సువాడ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, చించొల్లి గ్రామాల్లో పర్యటించి, వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. డీసీవోతో ఫోన్ ద్వారా మాట్లాడి తూకం చేసిన వడ్లను తరలించేందుకు లారీల కోసం ఎదురు చూడవద్దని, ట్రాక్టర్లలో రైస్‌మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తూకం చేసిన బస్తాలు, ధాన్యం రాశులపై టార్పాలిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు.
‘ఓటరు జాబితాలో తప్పులు
దొర్లకుండా చూస్తాం’
మద్నూర్: ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా చూస్తామని జుక్కల్ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలను వివరించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ అసిస్టెంట్‌లను నియమించుకోవాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక పునస్సమీక్షపై దిశానిర్దేశం చేశారు. సమావేశాలలో తహసీల్దార్లు ముజీబ్, అనిల్, వేణుగోపాల్ గౌడ్, లత, భిక్షపతి, మారుతి, రాజా నరేందర్‌గౌడ్, నాయబ్ తహసీల్దార్లు శరత్, హేమలత, శివ రామకృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సాయిలు, సంతోష్, రోహిదాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి
నస్రుల్లాబాద్ : మండలవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వెంకటేశ్ సూచించారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే బిల్లులు వస్తున్నాయన్నారు. ఆయన వెంట ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి సరిత, గ్రామస్తులు ఉన్నారు.
మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించాలి
బిచ్కుంద(జుక్కల్): మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. మంగళవారం బిచ్కుంద మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల క్రితం సంఘం ప్రతినిధులు సంఘం అభివృద్ధికి నిధులు కావాలని తనను కోరడంతో రూ. 10 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. భజన మండలి కమ్యూనిటీ హాల్ కోసం నిధులు కావాలని కోరడంతో ఎంపీ రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
‘రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’
‘రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’


