రైతులు నష్టపోకుండా చూడాలి
రామారెడ్డి: వర్షాలు కురుస్తున్నందున రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఉప్పల్‌వాయి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నందున కొనుగోలు కేంద్రాలలో వడ్లు తడవకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపిన వడ్లను వెంటనే అన్‌లోడ్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఆర్వో మదన్‌మోహన్, డీసీఎం రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


