గోల్డెన్ అవర్‌లో చికిత్స.. ప్రాణాలను కాపాడే క్షణం
ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి
● బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చిన వెంటనే రోగికి
వైద్యం అందించడం ఎంతోముఖ్యం
● నేడు వరల్డ్ బ్రెయిన్‌స్ట్రోక్ డే
నిజామాబాద్‌నాగారం: బ్రెయిన్ స్ట్రోక్ రోగికి వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్– గోల్డెన్ అవర్ చికిత్సపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
స్ట్రోక్ అనేది మెదడులో రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 సెకన్లకూ ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4 నుంచి 5 గంటలు ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారు. ఈ సమయంలో రోగికి సరైన చికిత్స అందితే మెదడు నష్టాన్ని గణనీయంగా తగ్గించి, రోగి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యం జరిగిన ప్రతి నిమిషం వేల మెదడు కణాల నష్టానికి దారితీస్తుంది.
లక్షణాలు:
● రోగి ముఖం వంగిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే స్ట్రోక్‌గా గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
● స్ట్రోక్‌ను గుర్తించడానికి ‘బీఈ ఫస్ట్’ పద్ధతి:
● బీ–అకస్మాత్తుగా సంతులనం కోల్పోవడం
● ఇ–కన్నుల చూపు తగ్గిపోవడం
● ఎఫ్– ముఖం ఒక వైపుకు వంగిపోవడం
● ఎ – చేయి బలహీనపడటం
● ఎస్– మాట తడబడటం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం
● టీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం
రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగతాగడం వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. యాంత్రీకరణ జీవనంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి.
– శ్రీకృష్ణాధిత్య, మెడికవర్ ఆస్పత్రి న్యూరో సర్జన్
గోల్డెన్ అవర్‌లో చికిత్స.. ప్రాణాలను కాపాడే క్షణం


