కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి సమగ్ర నగదు రహిత ఆరోగ్య బీమా పథకం అమలయ్యేవిధంగా చూడాలని, ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి వెంటనే బెనిఫిట్లు అందజేయాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం టీఎన్జీవోస్ కేంద్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించగా జిల్లా అధ్యక్షుడితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్క నాగరాజు, కేంద్ర సంఘం సభ్యుడు కాసం శివకుమార్‌లు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా పక్షాన మాట్లాడిన వెంకట్‌రెడ్డి వివిధ సమస్యలను కేంద్ర సంఘానికి నివేదించారు. పురపాలక సంఘాల పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు గురించి ప్రస్తావించారు.
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కామారెడ్డి హెడ్‌క్వార్టర్ యూనిట్ తొలి సమావేశం మంగళవారం యూనిట్ అధ్యక్షుడు చేపూరి అర్జున్‌రావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నిట్టు విఠల్‌రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వి.విశ్వనాథం, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గంగాగౌడ్‌లు హాజరయ్యారు. సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఎన్నికై న యూనిట్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ప్రతినిధులు మల్లేశం, యూనిట్ ప్రధాన కార్యదర్శి మహమూద్, ఆర్థిక కార్యదర్శి మనోహర్, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.రాములు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): అధికారులు వేధింపులు ఆపాలని సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ అన్నారు. ఆయన తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని చాలా మండలాలలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వెంటనే వేధింపులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో బీఎఫ్‌టీగా పనిచేస్తున్న భార్గవ్ అనే వ్యక్తి మండల అధికారుల వేధింపుల వల్ల గుండెపోటుతో మరణించాడన్నారు. ఇప్పటికై నా వేధింపులను ఆపాలని కోరారు.
‘ఉద్యోగులందరికి ఆరోగ్య బీమా అమలు చేయాలి’


