పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలి
అదనపు కలెక్టర్ విక్టర్
మద్నూర్(జుక్కల్): పక్క రాష్ట్రాల నుంచి వరి ధాన్యం రాకుండా చెక్‌పోస్ట్ సిబ్బంది తనిఖీలు చేపట్టాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. మండలంలోని సలాబత్‌పూర్ వద్ద సరిహద్దులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి సన్న రకం వడ్లు రాకుండా రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లును పరిశీలించారు. మిల్లులో తీసుకుంటున్న జాగ్రత్తలపై విచారించారు. తహసీల్దార్ ముజీబ్, సివిల్ సప్‌లై నాయబ్ తహసీల్దార్ ఖలీద్, తదితరులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
ఎల్లారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మంగళవారం గండిమాసానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, సొసైటీ కార్యదర్శి విశ్వనాథం తదితరులున్నారు.


