దావత్‌లు షురూ..!
సదాశివనగర్(ఎల్లారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డ విషయం అందరికి తెలిసిందే. అధికార పార్టీ నాయకుల్లో అత్యూత్సాహం మాత్రం మరింతా పెరిగిపోయింది. ఎన్నికల ఎప్పుడు వచ్చినా రిజర్వేషన్ మాత్రం మాకే కలిసి వస్తుందని, మీ సపోర్ట్ మాకే కావాలని ఇప్పటి నుంచే దావత్‌లు షురూ చేశారు. సదాశివనగర్ మండల కేంద్రంలో గతంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్‌కు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం బీసీ మహిళకు సర్పంచ్ స్థానం రిజర్వు అయినట్లు ప్రకటించడం వల్ల ఉత్సాహం మరింత పెరిగి పోయింది. బీసీ మహిళకు గానీ, బీసీ జనరల్‌కు గానీ, జనరల్ కు గానీ రిజర్వేషన్‌ను కేటాయిస్తే మీ సపోర్టు మాత్రం మాకే ఉండాలంటూ ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడు భారీ ఎత్తున దావత్‌లు షురూ చేశారు. ఇన్ని రోజులు బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండల కేంద్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారి పోయాయి. సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ నాయకుడినని ఒకరు, స్వచ్ఛందంగా ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని మరొక్కరు, పెద్దమ్మ టెంపుల్ వద్ద భారీ ఎత్తున షెడ్ నిర్మాణం కోసం అయ్యే ఖర్చును నేనే భరిస్తాను..మన ఓట్లన్ని నాకే పడేలా చూడాలని మరొక్కరు..ఇలా తమ తమ వర్గాలకు సంబంధించిన మద్ధతు పూర్తిగా మాకే కావాలని ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. కుల సంఘాల పెద్ద మనుషులతో చర్చలు జరుపుతూ తమ సభ్యుల ఓట్లు పూర్తి స్థాయిలో తమకే పడేలా చూడాలని వేడుకోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల కమిషన్ ఇంకా పూర్తి స్థాయిలో రిజర్వేషన్‌ను ప్రకటించక ముందే మండల కేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే, గ్రామాల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆశ్చర్యచకితులవుతున్నారు.
సదాశివనగర్ మండలకేంద్రంలో
ఓ పార్టీ నాయకుల అత్యుత్సాహం
రిజర్వేషన్ మాకే కలిసి వస్తుంది..
పూర్తి సపోర్ట్ మాకే కావాలి
అంటూ కుల సంఘాలకు ఎర


