అప్పు.. ముప్పు!
న్యూస్‌రీల్
రుణవాయిదాలు చెల్లించని పక్షంలో ఇళ్ల జప్తునకు చర్యలు..
సిబ్బందికి టార్గెట్లు..
తాకట్టు రుణాలు కొంపకు ఎసరుపెడుతున్నాయి. అవసరానికి కార్పొరేట్ రుణ సంస్థల వద్ద అప్పులు తీసుకున్న సామాన్యులు.. సకాలంలో వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. అప్పిచ్చినవారు నోటీసులు ఇస్తూ, ఆస్తులను జప్తు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● కొంపకు ఎసరుపెడుతున్న తాకట్టు రుణాలు
● సులువుగా రుణాలిచ్చి..
వసూళ్లలో జబర్దస్తీకి దిగుతున్న సంస్థలు
● విలవిల్లాడుతున్న సామాన్యులు
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
– 8లో u
జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లో కార్పొరేట్ సంస్థలు హౌజింగ్ రుణాలు ఇస్తామంటూ కార్యాలయాలు తెరిచాయి. సిబ్బందికి టార్గెట్లు ఇచ్చి మరీ వారిని ఊళ్ల మీదకు పంపిస్తున్నాయి. అప్పులు పుట్టక అవస్థల్లో ఉన్న వారు కార్పొరేట్ సంస్థల వలలో పడుతున్నారు. ఇప్పుడు అవసరం తీరితే సరిపోతుందని చాలా మంది ఇళ్లను తనఖా పెట్టేసి రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత నెలనెలా వాయిదాలు చెల్లించడం భారంగా మారుతోంది. మొదట్లో సర్దుబాటు చేసి కట్టినవారు నాలుగైదు నెలలు గడిచేసరికి డబ్బులు సర్దుబాటు కాక వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. వ్యవసాయం, కూలినాలి చేసుకుని బతికేవారికి నెలనెలా డబ్బులు సర్దుబాటు చేయడం సాధ్యం కావడం లేదు.
అవసరానికి అప్పులు పుట్టకపోవడంతో చాలామంది ఆస్తులను తనఖా పెట్టి (మార్టిగేజ్ చేసి) తీసుకుంటున్న రుణాలు ఉరితాళ్లు పేనుతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న కార్పొరేట్ రుణ సంస్థలు సులువుగా రుణాలిస్తున్నాయి. దీంతో అవసరం ఉందని చాలా మంది తమ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. మొదట్లో ఏదో రకంగా వాయిదాలు చెల్లిస్తున్నా.. తరువాత సర్దుబాటు కాకపోవడంతో వాయిదాలు తప్పుతున్నారు. దీంతో అప్పులిచ్చిన సంస్థలు వసూళ్ల కోసం జబర్దస్తీకి దిగుతున్నాయి. తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసుకుంటామంటూ నోటీసులు ఇవ్వడం, ఆస్తులపై బోర్డులు ఏర్పాటు చేస్తుండడంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. ఇంటి నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు, వ్యాపారులకు బ్యాంకులు పిలిచి రుణాలిస్తాయి. మార్టిగేజ్ రుణాలు కూడా వారికి అడిగినంత ఇస్తాయి. అయితే సామాన్యులకు అలాంటి అవకాశం ఉండదు. దీంతో చాలా మంది కార్పొరేట్ సంస్థల నుంచి రుణాలు తీసుకుని అప్పులపాలవుతున్నారు.
అవగాహన లేక...
కార్పొరేట్ సంస్థలకు ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్న వారికి తాము తీసుకున్న రుణానికి ఎంత వడ్డీ పడుతుందో తెలియదు. వడ్డీతో కలిపి రుణం చెల్లించడానికి వాయిదాలు పెట్టుకున్నపుడు నెలనెలా చెల్లించకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అన్న విషయంపైనా అవగాహన ఉండదు. రుణం ఇచ్చే సంస్థలు, ఆయా సంస్థల సిబ్బంది తక్కువ వడ్డీ అని చెప్పి రుణం మంజూరు చేస్తారే తప్ప, వాయిదాలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై అవగాహన కల్పించరు. తీసుకున్న అప్పు వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే ఏ ఇబ్బందీ ఉండదు. చాలా మంది వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీకి వడ్డీ కలిపి నడ్డి విరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఇంటిని, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టుకుని రుణాలిస్తున్న ఆయా సంస్థలు.. తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం వాయిదాలు చెల్లించని వారికి నోటీసులు ఇస్తున్నాయి. వాటికి స్పందించకపోతే ఆస్తులను జప్తు చేయడానికి వెనుకాడడం లేదు. ఇంటికి నోటీసులు అతికించడం, బోర్డులు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అయినా కూడా అప్పు వాయిదాలు క్లియర్ చేయనిపక్షంలో ఆస్తులను జప్తు చేస్తున్నారు. లీగల్‌గా అధికారం అప్పు ఇచ్చిన వారికే వెళుతోంది. దీంతో కొందరు అప్పు చెల్లించలేక, ఆస్తులు కాపాడుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో కొందరు తాకట్టు రుణాల బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పులు తీసుకున్న మరెందరో ఇబ్బందుల్లో ఉన్నారు.
అప్పు.. ముప్పు!
అప్పు.. ముప్పు!


