లక్కున్నోళ్లు!
● లక్కీడ్రా ద్వారా మద్యం
దుకాణాల కేటాయింపు
● కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రక్రియ
కామారెడ్డి రూరల్: జిల్లాలో 2025–27 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల కేటాయింపు కోసం సోమవారం లక్కీడ్రా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకాదేవి కల్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ప్రక్రియ సాగింది. ఉదయం 11 గంటలకు లక్కీడ్రా ప్రారంభం కావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా 11.30 గంటలకు ప్రారంభమైంది. దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అప్పటికే కల్యాణ మండపానికి చేరుకుని నిరీక్షించారు.
దరఖాస్తుదారులను మాత్రమే హాల్ లోనికి అనుమతించారు. కలెక్టర్ 49 దుకాణాలకు లక్కీ డ్రా తీశారు. దుకాణాలు దక్కినవారు సంబురాలు చేసుకోగా.. రానివారు నిరాశతో వెనుదిరిగారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, తహసీల్దార్ జనార్దన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లక్కీ డ్రాలో చాలామందికి నిరాశ మిగలగా.. కొందరికి జాక్‌పాట్ తగిటింది. ఓ మహిళ పేరుతో రెండు దుకాణాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మియాపూర్ ప్రాంతంలోని ఓల్డ్ హఫీజ్‌పేటకు చెందిన సుద్దపల్లి భారతికి ఎల్లారెడ్డి షాప్–2తోపాటు మద్నూర్ షాప్–1 దక్కాయి. అలాగే బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన అన్నదమ్ములైన నర్సాగౌడ్, మొగులాగౌడ్‌లకు ఇద్దరిని మద్యం దుకాణాలు వరించాయి. నిజాంసాగర్ దుకాణాన్ని నర్సాగౌడ్, నస్రుల్లాబాద్ దుకాణాన్ని మొగులాగౌడ్ దక్కించుకున్నారు.
లక్కున్నోళ్లు!


