‘ఉద్యోగ విరమణ చేసిన రోజే ప్రయోజనాలు ఇవ్వాలి’
కామారెడ్డి అర్బన్: ఉద్యోగ విరమణ చేసిన రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చూడాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్ హన్మంత్‌రెడ్డి, విజయరామరాజు, లచ్చయ్య మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసినవారికి రెండేళ్ల నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడం లేదని, దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రూ.40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, ఆత్మహత్యలకు కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, రవీందర్, రాజలింగం, సత్తయ్య, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: రగ్బీ అండర్ –17 బాలబాలికల జిల్లా జట్లను వచ్చేనెల 3వ తేదీన ఎంపిక చేయనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 3న ఉదయం 10 గంటలకు క్రీడాకారులు రిపోర్టు చేయాలని సూచించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని తెలిపారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు నవంబర్ 7, 8, 9 తేదీలలో డోర్నకల్, మహబూబాబాద్ జిల్లాలలో జరుగుతాయని పేర్కొన్నారు.
కామారెడ్డి టౌన్: జూడో అండర్–17 బాల, బాలికల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్లను ఈనెల 30న ఎంపిక చేయనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కార్యదర్శులు నాగమణి, హీరాలాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్‌లో ఎంపిక పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఒరిజినల్ ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్‌లతో రావాలని, ఇతర వివరాలకు 78939 73128 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి టౌన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మణికంఠ, రాహుల్, నవీన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిలోకి
నీటి విడుదల
బాల్కొండ: ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి పోమవారం ఉదయం మళ్లీ వరద పెరగడంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి 22,154 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మికాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది.


