ఉపాధి కూలీలకు అందని డబ్బులు
● ఐదు నెలలుగా కూలి కోసం
ఎదురుచూపులు
● జిల్లాలో 4.74 లక్షల మంది కూలీలు
ఎల్లారెడ్డిరూరల్: మండు వేసవిలో కష్టపడి ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు కూలి డబ్బులు అందకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చేసిన పనులకు సంబంధించి కూలి డబ్బులు వెంటనే అందించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో 536 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల 50 వేల జాబ్ కార్డులు ఉండగా.. 4 లక్షల 74 వేల మంది కూలీలు ఉన్నారు. వీరిలో 2 లక్షల 55 వేల 667 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఉపాధి కూలీలలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. మే నుంచి సెప్టెంబర్ వరకు ఉపాధి పనులకు సంబంధించిన డబ్బులు సైతం కూలీలకు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఽధికారులు స్పందించి వెంటనే చేసిన పనులకు కూలి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


