అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● వర్షాలతో రైతులు
నష్టపోకుండా చూడాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిచిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. వరి కోతలు జరపకుండా రైతులకు అవగాహన క ల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు పంపించడంతోపాటు వెంటనే అన్‌లోడింగ్ జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


