దళారుల పాలవుతున్న సోయా
మద్నూర్: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో సోయా రైతులు నష్టపోతున్నారు. దళారులు చెప్పిన ధరకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్, డోంగ్లీ మండలాల్లో సోయా పంట కోతలు దాదాపు పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో డబ్బులు అవసరం ఉన్న రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన ధరకు పంటను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం సోయా క్వింటాలుకు రూ. 5,320 మద్దతు ధర ప్రకటించగా.. వ్యాపారులు రూ. 4,200 లోపే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ. 11 వందలపైనే నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సోయా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.


