బానిషాతో.. బతుకు ఛిద్రం
● మద్యానికి బానిసలవుతున్న యువత
● నాలుగు నెలల్లో ముగ్గురి ఆత్మహత్య
● ఆధారం కోల్పోతున్న కుటుంబాలు
● సెప్టెంబర్ 6న నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డితండాకు చెందిన కేతావత్ రాజు(36)ను మద్యం తాగుడు మానేయాలని భార్య నచ్చజేప్పే ప్రయత్నం చేసింది. దీంతో రాజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మరుసటిరోజు కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించి అతనిని ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి ఇంటి ముందున్న పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలో ని పలు గ్రామాల్లో యువత మత్తుకు బానిసవుతున్నారు. మత్తు బాట వీడాలని కుటుంబసభ్యులు చె ప్పే మాటలు మింగుడు పడక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో మండలంలో ని ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులతో పాటు సమీపంలో ఉన్న మరో గ్రామానికి చెందిన యువకుడు మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో ప్రాణాలు తీసుకున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు ఆధారం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాయి.
యువత ఇటీవల కాలంలో మత్తుకు కట్టుబానిసలు గా మారుతున్నారు. చాలామంది మద్యం, కల్లు, గంజాయికి బానిసలై విలువైన భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మద్యంతోపాటు గంజాయి అలవాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు తప్పుడుదారిలో వెళ్తు న్నా గట్టిగా మందలించ లేక తల్లిదండ్రులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. అయితే, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌కు చెందిన దాకమొల్లి కుమార్(18) కల్లు, మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఈ నెల 22న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌కు చెందిన బైండ్ల అనిల్‌కుమార్(16) కల్లుకు బానిసయ్యాడు. జూలై 3న గ్రామశివారులో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డిమందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటిరోజు మరణించాడు.


