తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలి
● టీచర్లకు టెట్ అర్హతను
ఉపసంహరించుకోవాలి
● పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
దామోదర్ రెడ్డి
కామారెడ్డి అర్బన్: ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినప్పుడే నాణ్యమైన విద్య అందుతుందని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలతోనే ఉన్నత పాఠశాలలు బలోపేతం అవుతాయని వివరించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అల్లాపూర్ కుషాల్ అధ్యక్షతన ఆదివారం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా, అసోసియేట్ అధ్యక్షుడు గోవర్ధన్ తదితరులు మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించిన హెడ్‌మాస్టర్లకు ఇప్పటి వరకు నిధులు చెల్లించకపోవడం విచారకమని దామోదర్‌రెడ్డి అన్నారు. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ అర్హతను ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్యానెల్ జాబితా ప్రకారం ప్రతినెలా ప్రమోషన్ల కోసం కృషి చేస్తున్నామన్నారు. పీఆర్‌సీ, పెండింగ్ డీఏల విడుదల, హెల్త్‌కార్డుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఆదర్శ, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, సంఘ నియామవళి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అసోసియేట్ అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా బాధ్యులతోపాటు దాదాపు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


