ధాన్యం తీసుకోవడం లేదని రైతుల రాస్తారోకో
● రైస్ మిల్ నిర్వాహకుల తీరుపై
రైతుల ఆగ్రహం
● పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం
నస్రుల్లాబాద్ : మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి నుంచి వచ్చే లారీల్లోని ధాన్యం తీసుకునేందుకు ఓ రైస్ మిల్లు నిర్వాహకుడు నిరాకరించడంతో ఆ గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం క్రాస్ రోడ్డుపైకి చేరుకొని రాస్తారోకో చేశారు. ఇది వరకు వచ్చిన ధాన్యం నాసిరకంగా ఉందని, బొమ్మన్‌దేవ్‌పల్లి నుంచి వచ్చే ధాన్యాన్ని తీసుకోవద్దని అన్ని రైస్ మిల్లుల నిర్వాహకులకు సూచించడంతో లారీలు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సొసైటీ సీఈవోను ప్రశ్నించగా రైస్‌మిల్లర్లు ధాన్యం తీసుకోకపోతే తమకేమీ సంబంధం లేదని సమాధానం ఇచ్చారన్నారు. రైతులకు ఉపయోగపడని రైస్‌మిల్లులు ఎందుకని, రైస్ మిల్లు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్‌ఫోర్స్ డీటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మిల్లర్లతో ఆయన కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రైతులను సముదాయించేందుకు పోలీసులు రాగా, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని పలువురు వారి కాళ్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ రైతు పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా తోటి రైతులు అడ్డుకున్నారు. బొమ్మన్‌దేవ్‌పల్లి రైతులకు నస్రుల్లాబాద్, కామిశెట్టిపల్లి, నెమ్లి తదితర గ్రామాల రైతులు మద్దతు తెలిపారు. తహసీల్దార్ సువర్ణ రైతుల వద్దకు చేరుకొని సముదాయించారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని, సదరు రైస్ మిల్లర్ తీరుపై ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. డీసీఎస్‌వో వెంకటేశ్వరరావు, డీసీవో రామ్మోహన్‌రావు, డీఎం శ్రీకాంత్, డీఏవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణ, ఏవో భవానీ, ఆర్‌ఐ వెంకటస్వామి, పీఏసీఎస్ చైర్మన్ గంగారాం తదితరులు గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సుగుణ రైస్‌మిల్లు నిర్వాహకులు ధాన్యం తీసుకోవడం లేదని ఉన్నతాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ధాన్యం తీసుకోవడం లేదని రైతుల రాస్తారోకో
ధాన్యం తీసుకోవడం లేదని రైతుల రాస్తారోకో


