ఆదుకోవడం మరిచారా?
అభివృద్ధి నిధులు సరే..
● కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.18.75 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు
● వరద నష్టం సాయం ఇప్పట్లో అందేనా..
కామారెడ్డి టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.15 కోట్లతోపాటు అదనంగా మరో రూ.3.75 కోట్లు మొత్తం రూ.18.75 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాలా? లేక ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా పనులు చేపట్టాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నెలన్నర క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్లు, మురికికాలువలు, బ్రిడ్జిలు ధ్వంసమైన విషయం తెలిసిందే. మరమత్తులకు రూ.100 కోట్లు అవసరమవుతాయని ఆయాశాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇదిలా ఉండగా అన్ని మున్సిపాలిటీలతోపాటు కామారెడ్డి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం వరద నష్టానికి సంబంధించిన సాయాన్ని ఇప్పట్లో అందిస్తుందా? ప్రస్తుతం మంజూరు చేసిన రూ.18.75 కోట్లతో నూతన పనులు కాకుండా వరద కారణంగా దెబ్బతిన్న రోడ్లు, మురికి కాలువలు, బ్రిడ్జిల మరమ్మతులు చేపడతారా? అని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.


