అదృష్టం ఎవరిని వరించునో..
● రేపు లక్కీ డ్రా ద్వారా వైన్‌షాపుల
కేటాయింపు
● 49 దుకాణాలకు 1,502 దరఖాస్తులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నిర్దేశించిన గడువులోగా 49 దుకాణాలకు 1,502 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని రేణుకాదేవి కల్యాణ మండపంలో సోమవారం లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో డ్రా తీసి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.45.06 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకానుంది. ఇదిలా ఉండగా లక్కీడ్రాలో అదృష్టం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ దరఖాస్తుదారుల్లో నెలకొంది. డ్రాలో మద్యం దుకాణం దక్కకుంటే గుడ్ విల్ ఇచ్చి కొనేందుకు కూడా కొంత మంది ఆసక్తి చూపుతున్నారు. గత కొంత కాలంగా ఇతర వ్యాపారాలు దెబ్బతిన్న పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార వర్గాలు మద్యం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న పరిస్థితులతో చాలా మంది బిల్డర్లు, రియల్టర్లు మద్యం దుకాణాల కోసం టెండర్లు దాఖలు చేశారు. తమవారితోనూ వేయించారు. ఒక వేళ తమకు రాకుంటే గుడ్ విల్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయనున్నారు.


