అనర్హత వేటు వేయడం సరికాదు
● విచారణ జరిపి న్యాయం చేయాలి
● డీసీవోకు ఇద్దరు డైరెక్టర్ల వినతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తమపై అనర్హత వేటు వేసి పదవుల నుంచి తొలగించడం అన్యాయమని, తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సహకారసంఘానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శనివారం కామారెడ్డిలోని డీసీవో రాంమోహన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సహకారసంఘానికి ఎలాంటి బకాయి లేనప్పటికీ ఉన్నతాధికారులకు సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చి తనపై అనర్హత వేటు వేయించారని సహకారసంఘం వైస్‌చైర్మన్ మిద్దె బాబు తన వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో పాటు సహకారసంఘం ద్వారా కొందరు రైతులకు ఉద్దెరగా ఇప్పించిన ఫర్టిలైజర్ డబ్బులను తాను గత నెలలో చెల్లించానని మండలంలోని జలాల్‌పూర్ డైరెక్టర్ సిద్ధిరాంరెడ్డి తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఫర్టిలైజర్ బకాయి డబ్బులను చెల్లించే విషయమై ఎలాంటి గడువు విధించకపోగా తనపై అనర్హత వేటు వేసి తనకు అన్యాయం చేశారని ఆయన చెప్పారు. ఈ విషయమై తగు విచారణ జరిపించి తమ పదవులను పునరుద్ధరించాలని వారు కోరారు.


