
కమీషన్.. పరేషాన్..
జిల్లాలో 578 దుకాణాలు..
నిర్వహణ ఇబ్బందిగా మారింది..
● రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా
అందని వైనం
● జిల్లాలో సుమారు రూ.5కోట్లకు
పైగా బకాయిలు
ఎల్లారెడ్డి: రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు పరేషాన్ అవుతున్నారు. నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుకాణాల అద్దెలు సైతం కట్టలేకపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కమీషన్ చెల్లింపులు ఆలస్యం కావడంతో డీలర్లు నిరసన కూడా తెలిపారు.
జాడలేని కాంగ్రెస్ హామీ..
నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో రేషన్ దుకాణాల అద్దెలు సైతం కట్టలేక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. దుకాణపు అద్దె నెలకు రూ. 5వేలు, తూకం వేసే సహాయకుడికి రూ.3వేలు, హమాలీ కూలీకి రూ.వెయ్యి ప్రతీ నెలా కమీషన్ వచ్చినా రాకపోయినా డీలర్ చెల్లించక తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.140 కమీషన్‌ను రూ.3000లకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని డీలర్లు విమర్శిస్తున్నారు. కేరళ, తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో కూడా డీలర్లకు కమీషన్‌తోపాటు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం డీలర్లు ఇటీవల ఆందోళన బాట పట్టారు. కానీ కొత్తగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ రవీంద్ర వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో ఆందోళన వాయిదా వేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమకు కమీషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని జిల్లాలోని డీలర్లు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 578 రేషన్ దుకాణాలుండగా 2,88,553 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీటిలో 17,827 మంది అంత్యోదయ, 869 అన్నపూర్ణ, 2,69,898 మంది ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. 578 రేషన్ దుకాణాలకు గాను సగటున ప్రతీ దుకాణం ద్వారా 100 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. డీలర్లు బియ్యం పంపిణీ చేసినందుకు గాను ప్రతీ క్వింటాలుకు రూ.140 కమీషన్‌ను ప్రభుత్వ చెల్లిస్తుంది. ఇందులో రూ.95 కేంద్ర ప్రభుత్వం ద్వారా, రూ.45 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లిస్తారు. ఈ కమీషన్‌లలో రాష్ట్ర ప్రభుత్వ కమీషన్ ఒక నెల బకాయి ఉండగా, కేంద్ర ప్రభుత్వ కమీషన్ ఆరు నెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.5 కోట్లకు పైగా కమీషన్ బకాయిలు డీలర్లకు రావాల్సిఉందని సమాచారం.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 578 మంది రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ డబ్బులు రావడం లేదు. జిల్లాలోని ప్రతీ రేషన్ డీలరుకు దాదాపు రూ.10 వేల వరకు బకాయిలు రావాల్సి ఉన్నాయి. దీంతో డీలర్లకు రేషన్ షాపు నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణం బకాయిలు చెల్లించి ఆదుకోవాలి.
– నాగం సురేందర్, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డి

కమీషన్.. పరేషాన్..