
‘అభయహస్తం’ వాపస్ వచ్చేదెప్పుడో?
వివరాలు ప్రభుత్వానికి పంపించాం..
మోర్తాడ్(బాల్కొండ): మహిళా సంఘాల్లోని సభ్యులకు 55 ఏళ్ల వయస్సు నిండితే వారికి ఫించన్ పథ కం అమలు చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో ‘అభయహస్తం’ పథకాన్ని అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ప్రభుత్వం ఆసరా పథకం అమలు చేసి వివిధ వర్గాల వారికి పింఛన్లను మంజూరు చేసింది. ఈక్రమంలో 2014 నుంచి 2017 వరకు అభయహస్తంను అమలు చేసి ఆకస్మాత్తుగా రద్దు చేసింది. పథకం రద్దు చేసినప్పుడు మహిళలకు వారి సభ్యత్వ సొమ్మును వాపసు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో ఏళ్లుగా డబ్బుల కోసం మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
జిల్లాలో 50వేలకు పైగా సభ్యులు..
అభయహస్తం పింఛన్ పథకం కింద ఉమ్మడి జిల్లాలో మొదట 13,506 మంది అర్హులుగా గుర్తించి వారితో రూ.3,685 చొప్పున జమ చేయించారు. వీరికి ప్రతి నెలా రూ.500ల చొప్పున ఫించన్ అందించారు. తర్వాత మరో 40వేల మందిని సభ్యులుగా చేర్చుకుని వారితో ప్రతి సంవత్సరం రూ.385 చొప్పున ఐదేళ్ల పాటు రూ.1,925ని జమ చేయించారు. కానీ అభయహస్తం పథకంను 2017లో నిలుపుదల చేశారు. అప్పటి నుంచి ఈ పథకం కింద పింఛన్ల పంపిణీ రద్దు చేయడంతో పాటు పింఛన్ పొందడానికి అర్హత వయస్సు వచ్చిన వారి సొమ్మును బ్యాంకులోనే ఉంచారు. ఇలా జిల్లాలోని మహిళలకు సంబంధించి రూ.12,67,69,610 బ్యాంకులోనే మూలుగుతున్నాయి.
ఈ సొమ్ము సంబంధిత అర్జీదారులకు వాపసు చేయడానికి ఏడాది కింద మహిళా సంఘాల ప్రతినిధులు అభయహస్తం సభ్యత్వ రుసుం చెల్లించిన మహిళల వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా సొమ్మును తిరిగి ఇవ్వలేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కొనసాగిస్తున్న మహిళా సంఘాల్లో మెజార్టీ మహిళలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని అభయహస్తం సభ్యత్వ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని పలువురు కోరుతున్నారు.
2017లోనే రద్దయిన పథకం
సభ్యులకు సొమ్ము తిరిగివ్వడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
జిల్లాలోని మహిళలకు రావాల్సిన బకాయి రూ.12.67 కోట్లు
అభయహస్తం పథకం కింద తమవంతు వాటా ధ నం చెల్లించిన సభ్యుల వివరాలను గతంలోనే ప్ర భుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిధులు విడు దల చేయగానే దరఖాస్తుదారుల ఖాతాల్లో వారు గతంలో చెల్లించిన సొమ్ము జమ అయ్యే అవకాశం ఉంది. వివరాలు పంపించి చాలా నెలలు అవుతుంది. ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.
–తడకల శ్రీనివాస్, సీసీ సెర్ప్, మోర్తాడ్