
రూ.2 వేల కోసం హత్య
● నిందితుడి అరెస్ట్
ఖలీల్‌వాడి: రూ.2 వేల కోసం హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 6న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస కిరాణా షాప్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడైన నవీపేట మండలం జల్లపల్లిఫారానికి చెందిన షేక్ అహ్మద్‌ను సెప్టెంబర్ 30న పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. షేక్ అహ్మద్ నగరంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివసిస్తూ క్యాటరింగ్‌తోపాటు రోజువారీ కూలీ పనులు చేసేవాడు. మద్యం అలవాటు నేపథ్యంలో రైల్వేస్టేషన్ వద్ద ఒంటరిగా కనిపించే వ్యక్తులను బెదిరించి డబ్బులు దోచుకునే వాడు. గత నెల 6న అర్ధరాత్రి రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస కిరాణా షాప్ ఎదుట ఒక వృద్ధుడు డబ్బులు లెక్కబెడుతూ కనిపించగా దోచుకోవాలనే ఉద్దేశంతో అహ్మద్ అతని దగ్గరకు వెళ్లాడు. డబ్బులివ్వాలని బెదిరించగా వృద్ధుడు ఇవ్వలేదు. దీంతో అహ్మద్ ఒక బట్టతో వృద్ధుడి మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం అతని వద్ద నుంచి రూ.2 వేల నగదు, ఫోన్ దోచుకున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు.