
ట్రాన్స్‌కోను ముంచిన ‘మంజీర’
● వరద పోటెత్తడంతో నీటమునిగిన
ట్రాన్స్‌ఫార్మర్లు, దెబ్బతిన్న స్తంభాలు
● సుమారు రూ.20 లక్షల నష్టం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మంజీర పరివాహాక ప్రాంతంలో నదికి వరద పోటెత్తడంతో ట్రాన్స్‌కోకు భారీ నష్టం వాటిల్లింది. గతనెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చి న వరదనీటి ప్రవాహానికి మండలంలోని ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్‌శాఖకు సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. మండలంలోని 131 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతోపాటు సుమారు 200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు. అలాగే మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లికలాన్, వెంకంపల్లి, తాండూర్, మాటూ ర్, మాసాన్‌పల్లి, ఆత్మకూర్ తదితర గ్రామాల శివారుల్లోని పంట పొలాలు నీటమునిగాయి. కాగా, వరదనీటి నుంచి బయటపడ్డ పంటలను గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతో తాత్కాలికంగా రెండు 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి వ్యవసాయ బోరుబావులకు కరెంట్ సరఫరా చేశారు. దీంతోపాటు సుమారు 80 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టి తిరిగి బిగించారు. సుమారు నెలరోజులుగా పంటపొలాలు వరద నీటిలోనే ఉండడంతో మిగిలిన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు. వరదనీరు పూర్తిగా తొలగిపోయిన తర్వాత నీటమునిగిన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టడంతోపాటు నేలకూలిన స్తంభాలను సరిచేస్తామని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు.

ట్రాన్స్‌కోను ముంచిన ‘మంజీర’