
అమ్రాబాద్ శివారులో చిరుత సంచారం
● లేగ దూడపై దాడితో ఆలస్యంగా వెలుగులోకి..
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని అమ్రాబాద్ శివారులోగల గుండ్యానాయక్ తండా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు సోమవారం తెలిపారు. రెండ్రోజుల క్రితం 9 నెలల లేగ దూడపై దాడి చేసి ఎత్తుకెళ్లగా, కళేబరం గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెగావత్ రమేశ్ ప్రతిరోజూ 60 ఆవుల మందను మేత కోసం అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్తాడు. మూడు రోజుల క్రితం ఆవుల మందలోని 9 నెలల లేగ దూడ కన్పించలేదు. సోమవా రం కూడా ఆవుల మందను మేత కోసం తీసుకెళ్లగా, చిరుత ఆవుపై దాడికి యత్నించింది. గమనించిన రమేశ్ అరుపులు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయింది. దాడిలో ఆవుకు స్వల్పంగా గాయమైంది. లేగ దూడపై కూడా చిరుత దాడి చేసిందని నిర్ధారణకు వచ్చిన రమేశ్.. దాని కోసం వెతకగా బండరాళ్ల మధ్య కళేబరం కన్పించింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమివ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుత సంచరిస్తున్నట్లు సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్, బీట్ ఆఫీసర్ సురేశ్‌కుమార్, వాచర్లు రవి, బీమా గుర్తించారు. ప్రజలు, గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.