
‘విజ్ఞాన ప్రదర్శనలతో కొత్త ఆవిష్కరణలు’
కామారెడ్డి అర్బన్: విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలతో పాటు తమ సొంత ఆలోచనలను ఆవిష్కరింపజేయడానికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతో తోడ్పడుతాయని విశ్రాంత ఆచార్యులు, శ్రీసరస్వతి విద్యాపీఠం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్‌వీకే విశ్వేశ్వరరావు అన్నారు. కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్‌లో శుక్రవారం 3 రోజులపాటు రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన, సాంస్కృతిక మహోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డితో పాటు ముఖ్యవక్తగా విశ్రాంత ఆచార్యులు విశ్వేశ్వరరావు హాజరై మాట్లాడారు. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. శిశుమందిర్ పాఠశాలల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు శాసీ్త్రయ దృక్పథం, దేశభక్తి అంశాలతో ఉత్తమ పౌరులుగా తీర్చదిద్దుతారన్నారు. నలంద, తక్షశిల లాంటి ప్రపంచంలోనే ఉత్తమ విశ్వ విద్యాలయాలు ప్రాచీన భారతదేశంలో ఉండేవని, చర్రితకు ఎక్కని ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టింది భారతదేశమన్నారు. విద్యార్థులు వివేకానందుడిని ఆదర్శగా తీసుకోవాలని, ఆయన విద్యార్థి దశలో అన్నీ ప్రశ్నలే వేసేవారని, వాటి ద్వారా అనేక జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచ ఆధ్యాత్మిక, తత్వవేత్తగా నిలబడ్డారన్నారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతాయని శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. శ్రీసరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్యాంసుందర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు. పలు జిల్లాలకు చెందిన 303 మంది విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

‘విజ్ఞాన ప్రదర్శనలతో కొత్త ఆవిష్కరణలు’