
ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసింది
బ్రిడ్జి, పెద్ద చెరువు కట్ట పరిశీలన..
కేంద్రం సవతితల్లి ప్రేమే కారణం..
నాడు రాజన్న.. నేడు రేవంతన్న
బీబీపేట/దోమకొండ/భిక్కనూరు: తమ ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసిందని, రైతులకు మేలు చేకూర్చే ప్రభుత్వం తమదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రంలో బీసీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండల కేంద్రాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించగా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా అగ్రస్థానంలో నిలిపేందుకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ ముందుకు తీసుకువచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కేవలం ఓట్ల కోసం పథకాలను ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ ప్రజల అభ్యున్నతికోసం పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మహిళలను కించపరచడమే అవుతుందన్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ హయాంలో ఆనాడు విద్యుత్ మంత్రిగా షబ్బీర్‌అలీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల కారణంగానే నేడు ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోందని కొనియాడారు.
వరదల కారణంగా బీబీపేట ప్రధాన రహదారిపై దెబ్బతిన్న బ్రిడ్జీని మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అలాగే పెద్ద చెరువు బుంగ పూడ్చిన స్థలాన్ని కూడా వారు పరిశీలించారు.
రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడడానికి కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమే కారణమని మంత్రి సీతక్క విమర్శించారు. సీజన్ ప్రారంబానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత మేరకు యూరియా అవసరమో కేంద్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా వివరించిందన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి, యాదవరెడ్డి, అనంతరెడ్డి, సుతారి రమేశ్, మార్కెట్ కమిటీల చైర్మన్‌లు రాజు, పాత రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అంటనే పేదల సంక్షేమ పార్టీ అని.. నాడు ప్రజాభివృద్ధిలో రాజన్న.. నేడు అదే బాటలో రేవంతన్న ముందుకు దూసుకెళ్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. ఆయా మండలాల్లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. నాడు వెఎస్సాఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయగా.. నేడు రేవంత్‌రెడ్డి పేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నారన్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీసీలను అగ్రస్థానంలో
నిలిపేందుకు రిజర్వేషన్లు
ప్రజల అభ్యున్నతి కోసం పథకాలు
ఉచిత బస్సు ప్రయాణంపై బీజేపీ,
బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం
పంచాయతీరాజ్‌శాఖ,
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసింది