బీబీపేట: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగిస్తామని డీఆర్డీఏ పీడీ సురేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయభూముల్లో ఇసుక మేటలను ఆయన పరిశీలించారు. బాధితులు జాబ్ కార్డు కలిగి ఉండి చిన్న, సన్నకారు రైతులు అయితే ఈజీఎస్ కూలీల ద్వారా పనులు చేయిస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, ఏపీవో తిరుపతి, సిబ్బంది ఉన్నారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్
కామారెడ్డి అర్బన్: తెలంగాణ శ్రీసరస్వతి విద్యాపీఠం (ఎస్‌ఎస్‌వీపీ) ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రస్థాయి గణిత విజ్ఞాన, సంస్కృతి మహోత్సవం–2025 (రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్) నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌వీపీ జిల్లా అధ్యక్షుడు వి శ్యాంసుందర్‌రావు గురువారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్‌లో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ యాదగిరి ముఖ్యఅతిథిగా, ఎస్‌ఎస్‌వీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్వీకే వెంకటేశ్వరరావు వక్తగా హాజరవుతారని, రాష్ట్రంలోని అన్ని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూళ్ల నుంచి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
రిజర్వేషన్ హామీని నిలబెట్టుకున్నాం
కామారెడ్డి టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి నాయిని రజిత అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కా మారెడ్డిలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకునేలా మహిళలు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో మహిళా నాయకులు స్వప్న, ఫరీదా, జమున తదితరులు పాల్గొన్నారు.
‘సాగర్’ నుంచి 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ నుంచి వరద వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు గురువారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టులోకి 6,022 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1404.99 అడుగుల (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

‘ఉపాధి’ ద్వారా ఇసుక మేటలు తొలగిస్తాం