
మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు
జిల్లా అంతటా వర్షం!
● అధికారులు, ప్రజలు అప్రమత్తంగా
ఉండాలి
● అత్యవసరమైతేనే బయటికి రావాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచన
కామారెడ్డి క్రైం: జిల్లాలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సమాచారం అందించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలు, వరదకు గురయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, కాలువలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు తదితర అన్నింటినీ ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియపర్చాలని అధికారులకు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేశారు. చేపల వేటకు వెళ్లడం, పశువులు, గొర్రెలను నీటి వనరుల వద్దకు తీసుకువెళ్లడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468–220069కు సమాచారం అందించాలని సూచించారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యయంత్రాంగం అప్రమత్తమైంది. గత నెలలో కురిసిన భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇంకా చాలా రూట్లలో రోడ్లు క్లియర్ కాలేదు. మళ్లీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.