
‘సమాజాభివృద్ధిలో టీచర్ల పాత్ర కీలకం’
బాన్సువాడ : సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్య హబ్‌గా మార్చామన్నారు. నియోజకవర్గంలో రూ. 50 కోట్లతో 350 అదనపు తరగతి గదులను నిర్మించామన్నారు. దేశంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలు 13 మంజూరైతే అందులో ఒకటి బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేశామన్నారు. నర్సింగ్ కళాశాలలు జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేస్తారని, కానీ పట్టుబట్టి బాన్సువాడకు మంజురు చేయించానని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బదిలీల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ గుర్తు చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఎంఈవో నాగేశ్వర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, పీఆర్‌టీయూ ప్రతినిధులు నరహరి, శ్రీనివాస్, ప్రవీణ్, సంతోష్, రవీందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.