
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ
● మోసాన్ని గుర్తించి పోలీసులకు
అప్పగించిన కాలనీ వాసులు
సదాశివనగర్: కామారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి తాము వచ్చామంటూ 25 మందిని బురిడీ కొట్టించి దొరికి పోయిన వారిని పోలీసులకు అప్ప గించిన ఘటన బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో చోటు చేసుకుంది. రూ.2,500 చెల్లిస్తే రూ.లక్షా50వేలు ఇస్తామని దానికి సంబంధించిన ఫారాలను నింపి బాధితుల నుంచి సంతకాలు సైతం తీసుకున్నారు. మూడు నెలల్లో రూ. 50వేలు చెల్లిస్తే మిగతా రూ. లక్ష చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతో కాలనీకి చెందిన 25 మంది రూ. 2500 చెల్లించారు. కొంత మందికి అనుమానం రావడంతో మీరు కామారెడ్డిలోని ఏ బ్యాంక్ నుంచి వచ్చారని ప్రశ్నించారు. వారు తడబడుతూ ఓ ప్రైవేట్ బ్యాంక్ పేరు చెప్పారు. వెంటనే కాలనీవాసులు ఆ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి మీ బ్యాంక్ పేరు మీద ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు వచ్చారని చెప్పగా వారు మా బ్యాంక్ సిబ్బంది కాదని తెలపడంతో పాటు వారిని కాలనీవాసులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి నుంచి తీసుకున్న డబ్బులను ఇప్పించారు.