
తైబజార్ కాదు.. హప్తా వసూల్
పిట్లం(జుక్కల్): పిట్లంలో తైబజార్ పేరుతో వసూళ్ల మాఫియా బరితెగించింది. సంతలలో తైబజార్ రసీదులు ఇవ్వకుండానే వ్యాపారస్తులు, దుకాణదారుల నుంచి తైబజార్ నిర్వాహకులు దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి తీరు సంతలో తైబజార్ వసూల్‌లా లేదు హప్తా వసూల్‌లా ఉందని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇలా జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పిట్లం మేకల సంత, పిట్లం తైబజారు వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్ వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తైబజారు వేలం పాట నిర్వహించే సమమంలో రోజువారీ సంత, పశువుల దాఖాలు, గొర్రెలు, మేకలకు రేట్లను నిర్ణయించి ఇంతే వసూ లు చేయాలని కాంట్రాక్టర్‌కు అధికారులు సూచించారు. పంచాయతీ అధికారులు నిర్ణయించిన రేట్లనే కాంట్రాక్టర్ వసూలు చేయాలి. కానీ తైబజారు దక్కించుకున్న కాంట్రాక్టర్ మరో కొంత మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ఇష్టం వచ్చి నట్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరు సంతలో దుకాణదారులు, వ్యాపారులకు తైబజార్ రుసుము రసీదులు ఇవ్వకుండా ఒకటికి రెండింతలు డబ్బు లు వసూలు చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాల నుంచి చిన్నాచితక రైతులు సంతలో కూరగాయలు అమ్ము కోడానికి వస్తుంటారు. అందులో కొంత లా భం రాకున్న వారు నష్టపోయినా సరే వారి వద్ద నిర్ణయించిన దాని కంటే అధికంగా తైబజార్ వసూల్ చేస్తున్నారు. అధికంగా తైబజార్ వసూల్ చేస్తున్న కాంగ్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా సంతలో పంచాయతీ అధికారులు నిర్ణయించిన రేట్ల ఫ్లెక్సీల ను ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు.
పిట్లం మేకల సంతలో వసూళ్ల పర్వం
రసీదులు ఇవ్వని వైనం
ఇబ్బందులకు గురవుతున్న రైతులు, దుకాణదారులు, వ్యాపారులు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న
అధికారులు