
కదం తొక్కిన ఆదివాసి నాయక్‌పోడ్‌లు
● కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం ఆందోళన
నిజాంసాగర్(జుక్కల్): ఎస్టీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం ఆదివాసీనాయక్‌పోడ్ కులస్తులు కదం తొక్కారు. బుధవారం మహమ్మద్‌నగర్ మండల కేంద్రానికి నాయక్‌పోడ్ కులస్తులు ర్యాలీగా తరలి వచ్చారు. బస్టాండ్ ప్రాంతంలో బాన్సువాడ– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఎస్టీ కులద్రువీకరణ పత్రాలు ఇవ్వని మహమ్మద్‌నగర్ తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శివకుమార్ ధర్నా వద్దకు చేరుకొని నాయక్ పోడ్ కులస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుల ద్రువీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చేంతర వరకు కదిలేది లేదని వారు బీష్మించి కూర్చున్నారు. మహమ్మద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అక్కడి చేరుకొని నాయక్‌పోడ్‌కులస్తుల సమస్యను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు ఫోన్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ధర్నాను విరమించుకొని తహసీల్ కార్యాలయం ముట్టడికి వచ్చారు. తహసీల్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నాయక్‌పోడ్‌ల సమస్యలను తెలుసుకున్నారు. పదిహేను రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి వారి గ్రామాలకు వెళ్లారు. నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య, నేతలు భూమయ్య, శంకర్, సాయిబాబా, కాశీరాం తదితరులున్నారు.