
తెరపైకి రింగ్ రోడ్డు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాకేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు తెరదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పట్టణంలోని ట్రాఫిక్ కష్టాలను వివరించి, డీపీఆర్ చూపించి రింగ్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు.
కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఎదిగిన తరువాత మరింతగా విస్తరించింది. దీనికి తోడు పట్టణంలో పలు గ్రామాలను విలీనం చేశారు. అయితే పరిధి పెరిగినా.. పట్టణం విస్తరించినా.. సరైన రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ అవసరాల కోసం పట్టణానికి రావడం, పట్టణం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులను తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ‘రింగ్‌రోడ్డు’ను తెరపైకి తీసుకువచ్చారు. పట్టణానికి చుట్టూరా రింగ్ రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయించి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందుంచారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే.. కామారెడ్డి పట్టణానికి ఉన్న ఇబ్బందులను వివరించి, రింగ్ రోడ్డుకు నిధులు ఇవ్వాలని డీపీఆర్‌తో పాటు వినతిపత్రం అందించారు. కామారెడ్డి పట్టణానికి మరో వందేళ్ల దాకా ట్రాఫిక్ సమస్యలు లేకుండా రింగ్ రోడ్డును నిర్మించాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి విన్నవించారు. పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల మీదుగా దాదాపు 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలని రూపొందించిన డీపీఆర్‌ను అప్పగించారు. పట్టణ మ్యాప్‌ను చూపించి మరీ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. రోడ్డు నిర్మాణానికి రూ. 510 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఈ రోడ్డు నిర్మిస్తే పట్టణంపై ఒత్తిడి తగ్గుతుందని, అభివృద్ధి పెరుగుతుందని ఆయన పేర్కొంటున్నారు.
కేంద్రం కరుణిస్తుందా..
రింగ్ రోడ్డు నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్న పని. 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టడానికి మధ్యలో రెండు చోట్ల రైల్వే వంతెనలు, అలాగే వాగులపైన వంతెనాలు నిర్మించాల్సి ఉంటుంది. జాతీయ రహదారిని దాటే క్రమంలోనూ వంతెనలు అవసరం. దీనికి తోడు భూసేకరణ అనేది పెద్ద సవాల్‌గా ఉంటుంది. రోడ్డు నిర్మాణం చేయాలంటే రూ. 510 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్రం కరుణించి రింగ్‌రోడ్డు నిర్మించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ట్రాఫిక్ కష్టాలు అనేకం..
జిల్లా కేంద్రాన్ని రైల్వే లైన్ రెండుగా విభజిస్తోంది. అయితే పట్టణంలో ఒకే రైల్వే వంతెన ఉంది. వాహనాల రద్దీ పెరిగిన తరువాత వంతెన ఏమాత్రం సరిపోవడం లేదు. రైల్వే వంతెన మీద ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశోక్‌నగర్‌లో రైల్వే గేటు ఉండగా.. రైళ్ల సంఖ్య పెరిగి ప్రతి పావు గంటకోసారి గేటు వేయాల్సి వస్తోంది. గేటు వేసినపుడల్లా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వంతెన విస్తరించకపోవడం, అశోక్‌నగర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎటు వెళ్లాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎన్‌హెచ్–44 బైపాస్ రోడ్డు ద్వారా కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం ప్రాంతాలకు వెళ్లాలంటే కచ్చితంగా పట్టణంలోకి రావాల్సిందే.. అలాగే అటువైపు నుంచి ఇటు వెళ్లేవారు కూడా పట్టణం మీదుగానే వెళ్లాలి. పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుగా ఉండడం, ట్రాఫిక్ సమస్య మూలంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
కామారెడ్డిలో 54 కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదనలు
రూ.510 కోట్లతో అంచనాలు
కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన
ఎమ్మెల్యే కేవీఆర్
మంజూరు చేయాలని వినతి