
కొరతకు కారణం పోడేనా?
సరఫరా సక్రమంగానే ఉన్నా..
కామారెడ్డి క్రైం : జిల్లాలోని పలు ప్రాంతాలలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజూ ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితులున్నాయి. అయి తే అధికారుల అంచనాల మేరకు జిల్లాకు యూరి యా వచ్చినా కొరత ఏర్పడడం గమనార్హం. దీనికి పోడు వ్యవసాయమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు వ్యవసాయ శాఖ అధికారులు సాగులోకి వచ్చే పంటలు, గత సీజన్‌ను బట్టి అవసరమైన ఎరువులు, విత్తనాల విషయంలో అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. దాని ప్రకారమే అన్ని జిల్లాలకు విత్తనాలు, ఎరువుల సరఫరా జరుగుతోంది. ఈ లెక్కలన్నీ జిల్లావ్యాప్తంగా అధికారికంగా ఉన్న సాగు భూములు, సాగయ్యే పంటలపై ఆధారపడి ఉంటాయి. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే దాదాపు ప్రతి సీజన్‌లోనూ ఎరువుల కొరత కనిపిస్తుంది. ఈసారి కూడా ఖరీఫ్ చివరలో కామారెడ్డి డివిజన్ పరిధిలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొంది. రైతులు సింగిల్‌విండోల ఎదుట బారులు తీరుతున్నారు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు.
లెక్కలోకి రాని సాగు వల్లే..
జిల్లాలో ఒకప్పుడు 84 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అట వీ భూమి విస్తరించి ఉండేది. అటవీశాఖ కామారెడ్డి, బాన్సువాడ సబ్‌డివిజన్‌ల పరిధిలో 8 రేంజ్‌లు ఉన్నాయి. గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల పరిధిలో అడవులు ఎక్కువగా ఉన్నా యి. గతంలో భూమి లేని నిరుపేదలు ఎక్కడో ఓ చోట కొద్దిపాటి భూమిలో పోడు వ్యవసాయం చేసేవారు. కానీ ప్రభుత్వాలు పోడు పట్టాలు ఇవ్వ డం మొదలుపెట్టాక చాలామంది అటవీ భూములను కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో జిల్లాలో చాలా వరకు అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగిన గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల పరిధిలో అడవులు, గుట్టలు మాయమ య్యాయి. ఈ భూములలో సాగవుతున్న పంటలు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల్లోకి రాకపోవడంతో అంచనాలు తలకిందులవుతున్నాయి. దీంతో ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అడవుల ఆక్రమణకు చెక్‌పెట్టాలని, ఎరువుల కొరత తీర్చాలని రైతులు కోరుతున్నారు.
గాంధారి మండలంలో సాగు భూమిగా మారిన గుట్ట (ఫైల్)
ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 5.23 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు వేశారు. గత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 49 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగించా రు. ఈసారి(మే నుంచి సెప్టెంబర్ వరకు) 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 18,222 మెట్రిక్ టన్నుల డీఏపీ, 16,926 మెట్రిక్ టన్ను ల ఏంవోపీ, 44,762 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాకు 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. దానిని రైతులకు పంపిణీ చేశారు. ఇంకా సెప్టెంబర్ కోటా రావాల్సి ఉంది.
ఏటా పెరుగుతున్న అటవీ
భూముల సాగు విస్తీర్ణం
తలకిందులవుతున్న వ్యవసాయ అధికారుల అంచనాలు
యూరియా దొరక్క
ఇబ్బందిపడుతున్న రైతులు