
ఊపిరితిత్తుల్లో ఇరుకున్న శనగ గింజ
● చికిత్స చేసి తొలగించిన వైద్యులు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇరుకున్న శనగ గింజను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసి తొలగించి ఆయన ప్రాణాలు కాపాడారు. వివరాలు.. వారం రోజులుగా దగ్గు, దమ్ము, ఛాతినొప్పితో తీవ్ర అవస్థ పడుతున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి చికిత్స కోసం మంగళవారం వచ్చాడు. వైద్యులు పరీక్షించి, స్కానింగ్ చేయగా ఆయన ఊపిరితిత్తిలో ఒక శనగ గింజ ఉందని గుర్తించారు. పల్మనాలజిస్టు వైద్యుడు సాయికృష్ణారావు తన వైద్య బృందంతో కలిసి అధునాతనమైన బ్రాంకోస్కోపి చికిత్స ద్వారా ఇరుకున్న శనగగింజను తొలగించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, తినేటప్పుడు శనగ గింజ పొరపాటున ఊపిరితిత్తులలో ఇరుక్కుని ఉంటుందని వైద్యులు తెలిపారు.