
ఇసుక బొలెరో పట్టివేత
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని సిర్‌పూర్ శివారులో ఉన్న మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సోమవారం పట్టుకున్నట్లు ఆర్‌ఐ సాయిబాబా తెలిపారు. వాహనాన్ని డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు.
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి దేహశుద్ధి
రాజంపేట: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నముండ్ల నరేశ్ కొంతకాలంగా దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం గ్రామానికి చెందిన సావుసాని మహేందర్ రెడ్డి బోరు మోటారును నరేశ్ దొంగలించాడు. అనుమానం వచ్చిన మహేందర్‌రెడ్డి గ్రామస్తుల సహకారంతో సోమవారం నరేశ్‌ను ప్రశ్నించాడు. నరేశ్ వద్ద అనుమానాస్పదంగా ఓ బైకు కూడా కనిపించడటంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి స్టేషన్‌కు తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
గాంధారి(ఎల్లారెడ్డి): గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన శంషుద్దీన్‌కు తీవ్రగాయాలైనట్లు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. ఆదివారం పశువులను మేపుకొని రాత్రి ఇంటికి తీసుకెళ్తుండగా గాంధారి–బాన్సువాడ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. దీంతో శంషుద్దీన్‌కు రెండు కాళ్లు విరగడంతోపాటు వెన్నుపూసకు తీవ్రగాయాలైనట్లు తెలిపారు. బాధితుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.