
ఉప్పల్‌వాయిలో ఆందోళన
రామారెడ్డి : యూరియా కోసం రైతులు ఉప్పల్‌వాయి సొసైటీ భవనం వద్ద ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. సొసైటీకి 440 బస్తాల యూరియా రావడంతో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే రెండు బస్తాలైనా ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టారు. దీంతో అధికారులు పంపిణీని వాయిదా వేశారు. మరో లోడ్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ధర్నా చేశారు. పోలీసులు వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
మాచారెడ్డి : మండలకేంద్రానికి సోమవారం యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో వేకువజామునే అన్ని గ్రామాల నుంచి సింగిల్‌విండోకు వచ్చి బారులు తీరారు. యూరియా రాకపోవడంతో విసిగి వేసారిన రైతులు ఇటుకలను క్యూలో ఉంచి ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి, టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు.