
పనులు నాణ్యతతో చేపట్టాలి
● పంట నష్టం సర్వే కొనసాగుతోంది
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.10 కోట్లను కేటాయించిందన్నారు. ఇందులో ఇప్పటికే రూ.7.07 కోట్లను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు కేటాయించి పనులను ప్రారంభించామన్నారు. మిగిలిన వాటిని ఇరిగేషన్, ఇతర పనులకు కేటాయించామన్నారు. జిల్లాలో దెబ్బతిన్న 1,574 గృహాలలో 1,566 ఇళ్లకు నష్టపరిహారంగా రూ. 71.95 లక్షలను అందించామన్నారు. వరదలకు జిల్లాలో చనిపోయిన 89 పశువులు, 870 కోళ్లకు నష్టపరిహారం అందించాలని కోరుతూ రూ. 28.78 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఇప్పటివరకు చేసిన సర్వే ద్వారా 17,700 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని, 108 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని పేర్కొన్నారు. సర్వే కొనసాగుతోందని, తుది నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నష్టపరిహారం కోసం నివేదిస్తామని తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అన్ని శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో ప్రభుత్వ స్థలాలలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రానున్న రెండు రోజులు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు వీణ, పార్థసింహారెడ్డి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.