
శాశ్వత పరిష్కారం చూపేదెన్నడో..
● లింగంపేట మండలంలో వరదలు
వస్తే రాకపోకలు బంద్
● ధ్వంసమైన వంతెనలకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టాలని వినతి
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం నాగారం కాసులకత్తె వంతెన గత మూడేళ్లుగా వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. వంతెన, రోడ్డు కొట్టుకుపోవడంతో నాగారం, బాయంపల్లి, కొర్పోల్, బాణాపూర్, కిషన్‌నాయక్‌తండా, లక్ష్మన్‌నాయక్‌తండా, లింగంపల్లి, లింగంపేట, నల్లమడుగు, ముస్తాపూర్, తదితర గ్రామాలు, తండాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తాత్కాలికంగా మొరం వేసి రాకపోకలు పునరుద్ధరిస్తున్నారు. వంతెనకు ఇరువైపులా రోడ్డు వేసి సపోర్టుగా ప్రహరీ కట్టించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పొల్కంపేట శివారులో బండ్రేవ్ ఒర్రె వద్ద, బాణాపూర్, గాంధారి రోడ్డులో మెంగారం ఊర చెరువు కింద నిర్మించిన లోలెవల్ బ్రిడ్జ్‌లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమయ్యాయి. దాంతో లింగంపేట పొల్కంపేట, లింగంపేట గాంధారి రూట్లో వర్షాలు వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ బ్రిడ్జ్‌లు ఎత్తు పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సదరు వంతెనలకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.

శాశ్వత పరిష్కారం చూపేదెన్నడో..