
నష్టాన్ని అంచనా వేయండి
● ఈ నెల 12లోగా నివేదికలు
సమర్పించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం
కామారెడ్డి క్రైం: భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 12వ తేదీలోగా నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. ఈ నెల 4న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరదల నియంత్రణకు శాశ్వత పరిష్కారాలను చూపాలని ఆదేశించారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని ఆదేశించారని అన్నారు. శాశ్వత పరిష్కారం కోసం పట్టణాలు, గ్రామాలు, కాలనీల్లో విచారణ చేపట్టి ఆక్రమణలను తొలగించాలని సూచించారు. చేపట్టాల్సిన పనులకు మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
డివిజన్ స్థాయిలో కమిటీలు
డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవోల నేతృత్వంలో పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, మండల స్థాయి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడిన కమిటీలను వేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కమిటీ సభ్యులు అయా డివిజన్లలో పర్యటించి అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టులు, రహదారులు, పంట పొలాలు, గృహాలు, వరద బాధిత గ్రామాలు, కాలనీలను సందర్శిస్తారని తెలిపారు. అధిక వర్షాలు కురిసిన సమయంలో ముంపు, వనరులు దెబ్బతినడానికి కారణాలను తెలుసుకుంటారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో అధిక వర్షాలు వచ్చినా కూడా తీవ్ర నష్టం సంభవించకుండా శాసీ్త్రయ సలహాలు, సూచనలు అందించాలన్నారు. అదనంగా కల్వర్టులు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆక్రమణలను స్వాధీనం చేసుకోవడం, తొలగించడం, నివేదించడం చేయాలన్నారు. జిల్లా స్థాయి ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ, అదనపు కలెక్టర్, నీటిపారుదల శాఖ సీఈ ఉంటారని తెలిపారు. ఇసుక మేటల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను అందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1,600 ఇళ్లు దెబ్బతిన్నాయని, వాటిని పరిశీలించి అర్హత గలవారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం నివేదించాలని సూచించారు. టెలీ కాన్ఫరెనన్స్‌లో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు వీణ, పార్థసింహారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.