
తప్పని యూరియా కష్టాలు
● బారులు తీరుతున్న రైతులు
● టోకెన్లు పంపిణీ చేస్తున్న అధికారులు
రామారెడ్డి: రైతుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది. యూరియా కొరత రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది. యూరియా స్టాక్ వస్తుందనే తెలియగానే పంపిణీ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా రు. రాత్రి వేళ సైతం అక్కడే పడుకుంటున్న రైతుల కు ఓ టోకెన్ ఇచ్చి రెండు లారీల లోడ్లు వచ్చిన త ర్వాత పంపిణీ చేస్తామని చెప్పి పంపుతున్నారు. శనివారం రామారెడ్డి సొసైటీ భవనం వద్ద యూరియా పంపిణీ చేశారు. ఉదయం నుంచి రైతులు యూ రియా కోసం బారులు తీరారు. 880 బస్తాలను పంపిణీ చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.
టోకెన్లను అమ్ముకుంటున్నారు
పట్టా పాస్‌పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ చూపిస్తే ఓ టోకెన్ ఇస్తున్నారు. ఒక్క టోకెన్‌కు ఒక బస్తా యూరియా ఇస్తున్నారు. కొంతమంది తమకు అవసరం లేకున్నా క్యూ లైన్‌లో నిల్చుని టోకెన్‌లు పొంది రూ.100 ఒకటి చొప్పున టోకెన్‌ను రైతులకు అమ్ముకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.100 పెట్టడానికి కూడా రైతులు వెనక్కి రావడం లేదు. దీంతో క్యూలైన్లలో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది.