
నిందితులను వెంటనే పట్టుకోవాలి
బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకోవాలని బాన్సువాడ డివిజన్ అంబేడ్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం సీఐ అశోక్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు బంగారు మైసయ్య, ప్రశాంత్, మల్లూర్ సాయిలు,మన్నెచిన్న సాయిలు, సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వివాహిత మృతి
రాజంపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై దత్తాద్రి తెలిపారు. వివరాలు ఇలా.. రాజంపేట మండలం గుడితండాకు చెందిన ధారావత్ స్రవంతి–సురేష్ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈక్రమంలో మంగళవారం ఉదయం సురేష్ తన భార్య స్రవంతి(21)ని మందలించడంతో ఆమె క్షణికావేశంలో గడ్డి మందు తాగింది. దీంతో సురేష్ స్థానికుల సహాయంతో ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి లాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.