
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త!
సదాశివనగర్(ఎల్లారెడ్డి): వర్షాకాలం ప్రారంభం కావడంతో రోగాల సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో వ్యాధులు దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య శాఖాధికారులు. వానలు కురియడం మొదలు కావడంతో వాతావరణంలో మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పది మందిలో నలుగురికి జలుబు, ఇద్దరి జ్వరంతో కూడిన వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలున్నాయి. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా వచ్చి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య నిస్సత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిపై దద్దుర్లు, వాంతులు అరుదుగా విరేచనాలు కనిపిస్తాయి. మరి కొందరిలో జలుబు వంటి లక్షణాలు ఏవీ లేకుండానే జ్వరాలు వస్తాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి వైరల్ ఫీవర్ కొందరికి వస్తాయి.
వైరల్ ఫీవర్ రావడానికి గల కారణాలు..
వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్ని సార్లు శ్వాస నాళాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ప్రధానంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలి.
ఆరోగ్య శాఖ అప్రమత్తం..
సీజనల్ వ్యాధులు సోకకుండా మండల వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సదాశివనగర్, ఉత్తునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మెడికల్ క్యాంపుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. శిబిరంలో రోగులను పరీక్షించి అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
వాతావరణ మార్పులతో జ్వరాలు
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
సీజనల్ వ్యాధులు సోకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం రాగానే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. దోమతెరలను వినియోగించాలి. పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, నీటి గొట్టాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేడి పదార్థాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
– దివ్య, పీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యాధికారిణి, సదాశివనగర్