
ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ
లింగంపేట: ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం లింగంపేటవైపు నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. బస్సులో 102 మంది ప్రయాణికులున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు నుంచి లింగంపేట వైపు ఇసుక లారీ వస్తోంది. లింగంపేట మండలం ఎల్లమ్మతండా సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు రోడ్డు కిందికి దూసుకుపోయింది. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. లారీ డ్రైవర్ లింగంపేట మండలం పర్మళ్ల గ్రామానికి చెందిన బద్ద నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అతడి కుడి కాలు విరిగింది. బస్సు డ్రైవర్ వడ్ల శ్రావణ్‌కుమార్‌కూ గాయాలయ్యాయి. ఆయన స్వస్థలం లింగంపేట మండలం కొర్పోల్ గ్రామం. కండక్టర్ శంకర్‌రావుతోపాటు ప్రయాణికులు బూక్య మంజుల(అన్నారం), ఉంట గంగారెడ్డి(మర్కంటి), కుంట బాలరాజవ్వ(మర్కంటి), పురుషోత్తం(డిచ్‌పల్లి), పోచయ్య(కన్‌కల్), లింగమోల్ల రాజు(శెట్పల్లిసంగారెడ్డి), స్రవంతి(పోతారం), సత్తవ్వ(శెట్పల్లిసంగారెడ్డి), చాకలి రాజేష్(కుప్రియాల్), నక్క రాజమణి(దూస్‌గావ్), బ్రహ్మణపల్లి లక్ష్మి(తాడ్వాయి), అల్లిపురం అంజవ్వ(కాళోజీవాడి), పడమటి సుశీల(ఆరెపల్లి)లకు గాయాలయ్యాయని ప్రయాణికులు తెలిపారు. వీరిని సదాశివనగర్, దోమకొండ, రాజంపేట మండలాలకు చెందిన 108 అంబులెన్సులలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి కేకేవై మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. నల్లమడుగు, మోతె మీదుగా కామారెడ్డికి వాహనాలు వెళ్తుండగా మార్గమధ్యలో గుర్జాల్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రోడ్డు కిందికి దూసుకెళ్లిన బస్సు
పలువురికి తీవ్ర గాయాలు
భయాందోళనలకు గురైన
ప్రయాణికులు

ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ

ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ