
బడిబాట పట్టిద్దాం..
● వ్యాధులపై ప్రజలను అప్రమత్తం
చేస్తున్న చలపతి
● అమ్మలాంటి అడవికి
ముప్పు కలిగించవద్దంటున్న రమేశ్
● పిల్లలను బడిబాట
పట్టించాలంటున్న తగిరంచ
● నో మోర్ డ్రాపవుట్స్ అంటున్న అఖిల్
● పాటలతో సామాజిక చైతన్యానికి కృషి చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో పలువురు అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ కలానికి, గళానికి పని చెప్పారు. రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ వైద్య శాఖలో పనిచేసే బి.చలపతి విశ్వకర్మ పాటలు రాసి పాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అడవులకు నిప్పు పెడితే కలిగే అనర్థాలను వివరిస్తూ అటవీ శాఖ అదికారి వి.రమేశ్ రాసిన పాడిన పాటలు కనువిప్పు కలిగిస్తున్నాయి. చదువు మానేసిన విద్యార్థులను బడిబాట పట్టించడానికి తగిరంచ నర్సింహారెడ్డి అనే ఉపాధ్యాయుడు ‘బడి బాట పట్టిద్దామంటుంటే’.. బడి మానేసినోళ్లు ఉండొద్దంటూ సీహెచ్ అఖిల్ అనే ఉపాధ్యాయుడు ‘నో మోర్ డ్రాపవుట్స్’ అనే షార్ట్ ఫిలిం రూపొందించారు. వీరు చేస్తున్న ప్రయత్నాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తోపాటు ఆయా శాఖల అధికారులు కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తగిరంచ నర్సింహారెడ్డి అనే ఉపాధ్యాయుడు ‘మన ఊరి బడి.. ఇది అమ్మ ఒడి.. పలకా బలపం చేతబట్టి అఆఇఈ దిద్దించిన గుడి.. అంటూ బడిని గురించి తన పాటలో వివరించారు. అలాగే చేర్పిద్దాం మన పిల్లలను మన ఊరి సర్కారు బడిలోనే’ అంటూ సర్కారు బడి గొప్పతనాన్ని తన పాటలో వివరించారు. బడిబయట ఉన్న పిల్లలను ‘బడిబాట పట్టిద్దాం’ అంటూ మరోపాట రాశారు. నర్సింహారెడ్డి గజల్ కవిగానూ గుర్తింపు పొందారు. సామాజిక అంశాలపైనా కవితలు, పాటలు రాస్తారు. వివిధ అంశాలపై షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు.
సామాజిక చైతన్యం కోసం ఆ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తపిస్తున్నారు. కలానికి పదును పెట్టి, తాము పనిచేస్తున్న శాఖకు సంబంధించి వివిధ అంశాలపై చైతన్య గీతాలు రాసి ఆలపిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని అధికారులూ ప్రోత్సహిస్తున్నారు.

బడిబాట పట్టిద్దాం..