
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
నిజామాబాద్‌అర్బన్: గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో ఆర్థిక సంఘం సభ్యులు ఎం రమేశ్, సంకెపల్లి సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్‌లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరును చైర్మన్‌కు వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్టేట్ ఫైనానన్స్ కమిషన్ ద్వారా విడుదల అయిన నిధులు, వాటి వెచ్చింపు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకుని, పల్లె, పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాసీ్త్రయ దృక్పథంతో పని చేయాలని అన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణంతో అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని స్పష్టం చేశారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామ పంచాయతీల్లో సోలార్ విద్యుత్ విధానాన్ని అమలు చేస్తూ, క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. అదేవిధంగా నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల్లో ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, చందర్ రాథోడ్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్‌లు, జెడ్పీ సీఈవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్వాగతం..
ఉమ్మడి జిల్లా సమీక్షకు హాజరైన ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తదితరులు పూల మొక్క లు అందించి స్వాగతం పలికారు.
గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం
సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుకు కృషి చేయాలి
రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్
సిరిసిల్ల రాజయ్య
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల
అధికారులతో సమీక్ష