
ఒత్తిడిని జయించలేక..
● తనువు చాలించిన ఇంటర్ విద్యార్థి
● అర్థం కాని ఆంగ్లమాధ్యమ చదువు
● పదో తరగతి వరకు
తెలుగు మీడియంలో విద్యాభ్యాసం
నిజాంసాగర్/ఆర్మూర్ టౌన్ : పదో తరగతి వరకు తెలుగు మీడియం చదువుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థి ఇంటర్‌లో ఆంగ్లమాధ్యమ చదువు అర్థంకాక తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరికి బలవన్మ రణానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. నిజాంసాగర్ మండలం ఆరేడ్ గ్రామానికి చెందిన గడ్డం నిర్మల, నాగయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. చిన్న కుమారుడైన సంతోష్ (17) ఐదో తరగతి నుంచి 10 వ తరగతి వరకు అచ్చంపేట ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాడు. తెలుగుమీడియం చదువుల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. పదో తరగతి వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్‌లో ఇంగ్లిష్ మీడియం కావడంతో ఒత్తిడికి గురయ్యాడు. అయినా ఇంగ్లిష్ మీడియంలో పట్టు సాధించాలనుకున్న సంతోష్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. సప్లిమెంటరీలో ఒకటి మాత్రమే పాస్ కావడంతో మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. శనివారం వేకువ జామున సంతోష్ తాను చదువుతున్న గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి మైదానంలో వ్యాయామంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనంతరం సంతోష్ తువ్వాలు తీసుకుని కళాశాల గోడ దూకి బయటకు వెళ్లినట్లు సమాచారం. కొద్ది సేపటి తర్వాత డిగ్రీ కళాశాల వెనుక గల నర్సరీలో సంతోష్ తువ్వాలుతో చెట్టుకు ఉరి వేసుకుని కనపడ్డాడు. ఇదిలా ఉండగా సంతోష్ ఆత్మహత్యపై అతడి సోదరుడు శ్రీకాంత్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేల్పూర్ కళాశాలలో చాలామంది ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చి రెండు నెలలవుతోందని, ఇప్పుడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి విచారణ జరిపించాలని కోరారు.
సంతోష్ ఆత్మహత్యతో ఆరేడ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉంటూ చదువుల్లో చురుకుగా ఉండే సంతోష్ మరణాన్ని బంధు మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.