
ఉప్పొంగిన గుర్జాల్‌వాగు
వంతెనపైనుంచి పారిన వరద.. ● కాసేపు నిలిచిన రాకపోకలు
గాంధారి: గుర్జాల్– వండ్రికల్ గ్రామాల శివారులో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గుర్జాల్‌వాగు వంతెన పైనుంచి నీరు ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. కామారెడ్డి – లింగంపేట ప్రధాన రహదారిపై బస్సు, లారీ ఢీకొనడంతో పోలీసులు ట్రాఫిక్‌ను ఈ మార్గంలో మళ్లించారు. వాగుపైనుంచి నీరు పారడంతో సుమారు గంటపాటు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ప్రవాహ ఉధృతి తగ్గిన తర్వాత రాకపోకలు యథావిధిగా సాగాయి.
వాగవతల చిక్కుకున్న గ్రామస్తులు..
సదాశివనగర్: అమర్లబండ వాగు శనివారం సాయంత్రం కురిసి న వర్షానికి ప్రవహించింది. దీంతో పొలాలకు వెళ్లినవారు గ్రామంలోకి తిరిగి రావడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన గ్రామస్తులు పంచాయతీ ట్రాక్టర్‌ను తీసుకెళ్లి వాగు అవతలి వైపు ఉన్న రైతులను తీసుకునివచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.